Header Ads Widget

శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 2026 - 10 నిర్ణయాలు

శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 2026 - 10 నిర్ణయాలు 


- MR News Telugu -

 ( మద్దిమడుగు మునిరత్నం) 



 శ్రీకాళహస్తి మహాశివరాత్రి - 2026 వ సంవత్సరానికి చేయబోవు ఏర్పాట్లుపై, శ్రీకాళహస్తి ఆలయంలో దేవదాయ శాఖ మంత్రి అయిన ఆనం రాంనారాయణరెడ్డి అధ్యక్షతన తిరుపతి జిల్లా కలెక్టర్, SP మరియు స్థానిక MLA బొజ్జల సుధీర్ రెడ్డి, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, మరియు ఆలయ పాలక మండల అధ్యక్షులు కొట్టేసాయి ప్రసాద్ తో పాటుగా, స్థానికంగా ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ లతో ఈ బ్రహ్మోత్సవాలలో చేయు ఏర్పాట్ల సాధ్యా..సాధ్యాలపై అన్ని ప్రభుత్వ విభాగాలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమీక్షించుకున్నారు. ఆ తదనంతరం తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మంత్రి ఈ క్రింది విధమైన నిర్ణయాలను ప్రకటించడం జరిగింది.అందులో ముఖ్యమైనవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.



తీసుకున్న 10 నిర్ణయాలు ఇవే !


1) ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో గత సంవత్సరం కన్నా మిన్నగా సరికొత్త విధానంలో ఆలయ ప్రాగణమంతా విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు.


 2) ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా, మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా ద్వారా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మరియు వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను షేర్ చేయనున్నామని, దీంతోపాటు ప్రత్యేకంగా గ్రామాలలో కూడా సాధ్యమైనంతవరకు మొబైల్ స్క్రీన్ లను ఏర్పాటు చేయించి శివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంగా అందరికి చేరువయ్యేలా కార్యాచరణ రూపొందించమన్నారు.






 3) ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఐదు వేలమంది వాలంటీర్లు.. భక్తులకు సేవకులుగా సేవలందించనున్నారని, ఈ సేవకులు ముఖ్యంగా భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడం గాని, భక్తులను తాకడం గానీ, భక్తులను ముందుకు నెట్టడం, లాగడం వంటివి అస్సలు చేయకుండా, భక్తి భావాలు పెంపొందించే విధంగా అందరితో సవ్యంగా నడుచుకునేలా వాళ్లకు సూచనలు ఇచ్చామని తెలియజేశారు.


4) గత సంవత్సరం బ్రహ్మోత్సవాలలో లాగ, కాకుండా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో 50 రూపాయల టికెట్ ని రద్దు చేయనున్నామని, రూ200 టికెట్ మరియు రూ500 టికెట్ మరియు ఉచిత దర్శనాలుకు మాత్రమే అవకాశాలు ఉంటాయని తెలియజేశారు.


 5) పట్టణంలో 20 కోట్ల రూపాయలతో శివమ్ టు శివమ్ రోడ్డు వేస్తున్న విషయం గురించి ప్రస్తావిస్తూ ఫిబ్రవరి 09 వ తారీఖున వన్ వే రోడ్డు ని ప్రారంభిస్తున్నామని, శివరాత్రి తరువాత డబల్ రోడ్డు కూడా అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలియజేశారు.



6) శ్రీకాళహస్తి స్థానికులకు మరియు నియోజకవర్గ ప్రజలకు ఒకరోజు ఉచిత దర్శనం కల్పించి, లడ్డు ప్రసాదం కూడ స్థానికులకు అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అది ఎప్పుడనేది మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం పండితులతో చర్చించి, త్వరలోనే ఒక తేదీని కూడ ప్రకటిస్తామని మంత్రి తెలియజేశారు.


7) ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి వచ్చే మహిళా భక్తులకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శనానంతరం, ప్రతి ఒక మహిళా భక్తురాలికి జాకెట్టు, పసుపు, కుంకుమ, మరియు గాజులను ఇవ్వనున్నట్లు తెలియజేశారు.



8) దర్శనార్థం కొరకు భక్తులు వేచి ఉండే క్యూలైన్లలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ మరియు మజ్జిగ ఇవ్వాలని, అదేవిదంగా పిల్లలకు, వృద్ధులకు పాలు, మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు.



9) ఈ సంవత్సరం, కేటాయించిన మూడు స్లాట్ లలో మాత్రమే VIP లు అయినా, VVIP లు అయినా మరియు జర్నలిస్టుల కుటుంబాలు అయినా అదేవిధంగా పాలక మండలి సభ్యుల కుటుంబాలైననూ... మీకు కేటాయించిన ఆయా సమయాలలో మాత్రమే దర్శన భాగ్యంకి అవకాశం కల్పిస్తామన్నారు.. ఆ టైమింగ్స్ ఎప్పుడు అనేది జిల్లా కలెక్టర్ మరియు ఆలయ అధికారులు చర్చించి త్వరలోనే వివరిస్తామన్నారు. ఆ నిబంధనలు అతిక్రమించిన వారిపై, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీజేశారు.


10) ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పించే కార్యక్రమంలో మొదటగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉందన్నారు, కానీ ఆ సమయాలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి కావున ఆయన వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, అలాంటి రాలేని సందర్భంలో దేవదాయ శాఖ మంత్రి ద్వారానే ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు, పట్టు వస్త్రాలు అందజేయనున్నట్లు మంత్రి తెలియజేశారు.


#Srikalahasti #MahaShivaratri2026 #ShivaratriArrangements

#SrikalahastiTemple #APTempleNews #MRNewsTelugu

Post a Comment

0 Comments