Header Ads Widget

మత్తుమందు ఇచ్చి తాళిబొట్టు దొంగతనం

 మత్తుమందు ఇచ్చి తాళిబొట్టు దొంగతనం


MR News Telugu - (మునిరత్నం)


తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో భక్తుల భద్రత కోసం చేపట్టిన కట్టుదిట్టమైన నిఘా, దర్యాప్తు చర్యల్లో భాగంగా మత్తు మందు ఇచ్చి బంగారు తాళిబొట్టు చైన్ దొంగతనం చేసిన మహిళను తిరుమల I టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే....!


తిరుపతి పట్టణం పాత మున్సిపల్ ఆఫీస్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న తిరుపతి రాధాకృష్ణ విజయ (63) అనే వృద్ధ మహిళ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం 02-01-2026 న తిరుమలకు చేరుకుని సర్వదర్శనం క్యూలైన్‌లో ఉన్న సమయంలో ఒక అనుమానిత మహిళ ఆమెతో పరిచయం పెంచుకుంది. అనంతరం 03-01-2026 ఉదయం వైకుంఠం క్యూలైన్–II (VQC–II) లోని కంపార్ట్మెంట్ నం.20 వద్ద బాధితురాలికి మత్తు మాత్ర ఇచ్చి, ఆమె మత్తులోకి వెళ్లిన సమయంలో ఆమె మెడలో ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు తాళిబొట్టు చైన్‌ను దొంగిలించి పరారైంది.



ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.1/2026 u/s 123, 303(2) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక విశ్లేషణ మరియు సమాచార సేకరణ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. ఈ కేసులో నిందితురాలిగా కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, శ్రీనివాసపురం తాలూకా, కప్పల్లి గ్రామానికి చెందిన నాగిశెట్టి నాగరత్నమ్మ (45) ను 10-01-2026 న తిరుమల HT కాంప్లెక్స్ బాత్రూంల సమీపంలో తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చలపతి ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు.

నిందితురాలి వద్ద నుంచి సుమారు 57 గ్రాముల బరువు కలిగిన బంగారు తాళిబొట్టు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బంగారు పతకం, గిన్నె బొట్టు, కాసులు, గుండ్లు, మామిడి పండు, అరటి గుత్తి, ముత్యం, పగడము ఉన్నాయి. నిందితురాలిని చట్ట ప్రకారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.



ఈ కేసును సమర్థంగా ఛేదించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. భక్తులకు సూచనగా తిరుమల పోలీసులు, దర్శనానికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఒంటరిగా వచ్చే వృద్ధ మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.




Post a Comment

0 Comments