క్రొత్త GST బుక్లెట్ విడుదల చేసిన చంద్రబాబు
MR News Telugu:
నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం పై సామాన్యునికి సైతం అర్థమయ్యేలా బుక్‌లెట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేడు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర పన్నుల విధానం పై అధికారులతో సమీక్షించారు. చాలా వస్తువులపై జీఎస్టీని18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గింది. వెన్న, నెయ్యి, పనీర్, సబ్బులు, షాంపూ, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపై పన్ను తగ్గింది. అలాగే, పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పనీర్, బ్రెడ్ వంటి వాటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో మధ్యతరగతి వారికి పెద్ద ఊరట లభించింది. అంతేకాకుండా, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్‌పై పన్ను 5 శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇది రైతులకు భారీ సహాయంగా సహాయపడనుంది.అలాగే, చేనేత, చేతివృత్తుల వారిని ప్రోత్సహించడానికి, వారి ఉత్పత్తులైన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు పెరగడానికి అవకాశం లభిస్తుంది.సేవా రంగం, హోటల్ వసతులపై జీఎస్టీ తగ్గించడం వల్ల హోటల్ ఛార్జీలు తగ్గుతాయి, తద్వారా పర్యాటక రంగానికి ప్రోత్సాహంగా ఉంటుంది..ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) రంగానికి, ఉపాధి కల్పనకు బలం చేకూరుస్తుంది. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి, కొన్ని ప్రాణ రక్షక మందులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించారు. ఈ సంస్కరణల వల్ల వినియోగదారులకు ₹1 లక్ష కోట్ల వరకు పొదుపు అవుతుందని అంచనా వేయటం జరిగింది.
0 Comments